Nrusimha Jayanti :

Narasimha Jayanti

Nrusimha Jayanti – నృసింహ జయంతివైశాఖ శుద్ధ చతుర్ధశి

ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం

హిరణ్యకశిపుడు అడిగిన వరం:

ఇంట్లోగానీ – బయటగానీ ,
పగలుగానీ – రాత్రిగానీ ,
మానవునిచేతగానీ – ఏ జంతువుచేతనైనా గానీ , ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ , ప్రాణంలేనటువంటివాటితోగానీ
తనకి మరణం లేకుండా ఉండాలని.
శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని
ఇంటిలోపలా బయటా కాక , గుమ్మం మధ్యలో , పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ , అటు మానవుడూ , ఇటు జంతువూకాక నరసింహుడుగా ,
ప్రాణం ఉన్నవీకాక , లేనివీకాక గోళ్ళతో సంహరించాడు.

నారసింహావతారం – అంతరార్థం

హిరణ్యకశిపుడు

హిరణ్యము – ప్రకృతి ప్రకృతినే చూచి , దానితోనే ఆనందం పొందువాడు.

ప్రహ్లాదుడు

ప్ర- ఉత్తమమైన

హ్లాద-(జ్ఞాన) ఆనందం.

నర సింహ

సింహం శిరస్సు – నర మొండెం
దైవ ఆలోచన – మానవ కర్మ
(మృగాణాం మృగేంద్రోహం)
స్తంభం – నిశ్చలతత్త్వం

Narasimha Jayanti
Narasimha Jayanti

జ్ఞానానందాన్ని కాపాడటం కోసం , హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం “నరసింహావతారం” శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం.

నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో….

అవతార వృత్తాంతం:

వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీ హరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు.

ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా హిరణ్యాక్ష , హిరణ్యకశిపుడు గా జన్మిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు.

దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని , రాత్రి గాని , ఇంటి బయట గాని , ఇంటి లోపల గాని , భూమి మీద కాని , ఆకాశంలో గాని , అస్త్రం చే గాని , శస్త్రం చేత గాని , మనిషి చేత గాని , మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు.

కానీ హిరణ్య కశిపుని భార్య లీలావతికి పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు.

గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని ఎంత బోధించినా , బెదరించినా , చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది.

ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విష ప్రయోగం చేసినా , ఏనుగులతో తొక్కించినా , లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా.

“ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు , ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి” అని భక్తితో ప్రహ్లాదుడు “ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు” అని చెప్పగా , దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు “ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి” అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు.

అంతే భయంకరాకారుడై , తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.

పాంచరాత్రాగమంలో 70 కి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. కానీ ముఖ్యమైనవి మాత్రం
నవ నారసింహమూర్తులు. అవి… Nrusimha Jayanti

1) ఉగ్ర నారసింహుడు

2) కృద్ధ నారసింహుడు

3) వీర నారసింహుడు

4) విలంబ నారసింహుడు

5) కోప నారసింహుడు

6) యోగ నారసింహుడు

7) అఘోర నారసింహుడు

8) సుదర్శన నారసింహుడు

9) శ్రీలక్ష్మీ నారసింహుడు

నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది.

అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై , చేయరాని పనులు చేసేవాడు.

ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు , వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి.

వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు. వేశ్య కూడా ఉపవాసము , జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.

సృష్టి , స్థితి , లయ కారకులలో స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువు ఈ లోకాలను ఉధ్ధరించడానికి శిష్టులను రక్షించడానికి అనేక అవతారాలు ఎత్తాడు.

బాహ్య రూపంలో కాకుండా , భావ రూపంలో ఈ అవతారాలన్నింటిలో అందమైన అవతారమేదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది మహా వైష్ణవ భక్తుడైన తిరుమళిశైఆళ్వారుల వారికి.

వీరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో నాలగవ వారు. తొమ్మిది అవతార పురుషుల మధ్య పోటీ పెట్టి అందులో అత్యంత సుందరావతారాన్ని ఎన్నుకొని తద్వారా తనలోని జిజ్ఞాసను తీర్చుకోవాలని సంకల్పించారు.

ప్రాధమిక ‌పోటీకి మత్స్య , కూర్మ , వరాహ అవతారాలు. ఇవేవీ మానవరూపంలో లేనందున పోటీ నుండి తొలగించారు. రెండవ వరస పోటీ నరసింహుడి నుండి శ్రీకృష్ణ అవతారాల మధ్య.

ఇందులో వామనుడు తొలుత బాలుడిగా వచ్చి కేవలం మూడు అడుగుల నేల కోరి చూస్తూండగానే నభోంతరాళాలకు ఎదిగిపోయి బలిని అధఃపాతాళానికి అణగదొక్కడం ద్వారా తిరుమళిసై వారిచే పోటీ నుండి తిరస్కరింపబడ్డాడు.

గండ్రగొడ్డలి చేత ధరించి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసిన ఉగ్రరూపి పరశురాముడు సుందరుడు కానేరడని ఆ వైష్ణవ భక్తుడు భావించి పరశురాముడిని అందాల పోటీనుండి తొలగించాడు.

ఒకే కుటుంబానికి చెందిన వారనే కారణంగా బలరామ , కృష్ణులలో బలరాముడు పోటీ చేసే అర్హత కోల్పొయాడు.

తిరుమళిశై ఊహాత్మకంగా పెట్టిన సౌందర్య పోటీలలో ఆఖరి వరసలో నిలబడినవారు నరసింహస్వామి , శ్రీ రాముడు , శ్రీ కృష్ణుడు.

శ్రీరాముడు సకలగుణాభిరాముడే , ధర్మవర్తనుడే కానీ ప్రత్యేకించి సుందరాకారుడని కీర్తింపబడలేదు. అలాగే , శ్రీకృష్ణుడు చతురుడు , గోపికా మానస చోరుడు. గొప్ప రాజకీయవేత్త. అందువలన , వీరిని అందగాళ్ళు గా భావించలేదు తిరుమళిశై ఆళ్వార్.

చివరకు మిగిలినది నరసింహస్వామి. ఆపదలలో ఉన్నవారిని పిలువగనే వచ్చి రక్షించినవాడే అందగాడు. హిరణ్యకశిపుడిని నిర్జించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహుడే అంతర్ముఖ సుందరుడని నిర్ణయించుకుంటాడు తిరుమళిశై ఆళ్వార్.

ఇందుకు మరొక కారణం కూడా వ్యాసుడు , పోతన గారు చెప్పిన భావాన్నే చెపుతాడాయన.

భక్తుడైన బాల ప్రహ్లాదుడిని ఆపద నుండి రక్షించడం కోసం మాత్రమే కాక , తన మీద నమ్మకంతో “ఇందుగలడందు లేడని సందేహము వలదు ఛక్రి సర్వోపగతుండు , ఎందెందు వెతకి చూచిన అందందే కలడని ” ప్రగాఢ విశ్వాసం తో కొలచినందుకు అతని మాటను వమ్ము చేయకుండా రాతి స్థంభాన్ని చీల్చుకొని వచ్చిన నృసింహు డే సుందరుడని తిరుమళిశై విశ్వసించాడు.

కొన్ని పురాణాలలో , ఆండాళ్ రచనలలో ‘ సుందర నృసింహుడని ‘ కీర్తించబడినవాడు నరసింహ స్వామి.
రామాయణ , భాగవతాది కావ్యాలలో కూడా నరసింహుని ప్రశస్తి కనిపిస్తుంది.

సీతాపహరణ సమయంలో మారీచుడు రావణుడికి హితవు చెపుతాడు. రాముడు సామాన్యుడు కాడు. ఆయనే నరసింహ రాఘవుడు. ఆయన ఒడిలో ఆసీనురాలైన శ్రీమహాలక్ష్మే సీత. నీవు రాముని జయించలేవని చెపుతాడు.

అదే విధంగా , సుగ్రీవుడు రాముడిని స్తుతిస్తూ , నీవు సామాన్య రాజువు కావు , సాక్షాత్ నరసింహ రాఘవుడివి. ఆబలమే వాలిని సంహరించేలా చేసింది అని అంటాడు.

భాగవతంలో , రుక్మిణి శ్రీకృష్ణుడికి వ్రాసిన లేఖ లో “కాలే నృసింహ నరలోకాభిరామం” అని అంటుంది.

తిరుమల శ్రీనివాసుడు , పద్మావతి కూడా నృసింహస్వామిని పూజించినట్లు బ్రహ్మాండ పురాణం , హరివంశ కావ్యాలు చెపుతున్నాయి.
సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నృసింహుడు..

అంతటి మహత్తు గల నరసింహ స్వామి కి ఎన్నో ఆలయాలున్నాయి. సింహాచల వరాహ నరసింహ స్వామి , అహోబిల లక్ష్మీ నరసింహస్వామి , యాదగిరి గుట్ట నరసింహ స్వామి.

మంగళగిరి పానకాల నరసింహ స్వామి , వేదగిరి నరసింహస్వామి , షోలింగర్ నరసింహస్వామి , సింగపెరుమళ్ కోయిల్ లక్ష్మీ నరసింహ స్వామి, కర్ణాటకలోని జ్వాలా నరసింహ స్వామి , ఇలా వివిధ నామాలతో నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చి వారికి కష్టాలను తొలగించి కాపాడుతున్నాడు.

అటువంటి భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి రేపు అందరూ ఆ స్వామిని భక్తి శ్రధ్ధలతో పూజించి తరించండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: