Dhanvantari Jayanti :

Dhanvantari Jayanti

Dhanvantari Jayanti – ధన్వంతరి జయంతి – శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.

దేవతలు , దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా , దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు.

అనంతరం కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , చంద్రుడు , శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు.

ఆ తరవాత అమృతకలశం , ఔషధులు , ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు.

‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో , ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు , ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో ,

విశాలమైన వక్షస్థలంతో , సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.

ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు.

అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని , కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు.

ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని , అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.

సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. Dhanvantari Jayanti

అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం.

అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి , మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి , అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది.

Dhanvantari Jayanti
Dhanvantari Jayanti

ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు.

అది తెలిసిన సర్పరాజు వాసుకి , ద్రోణ , పుండరీక , ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు.

ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు.

శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది.

ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు , బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.

అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం.

ఇందులో కాయ , బాల , గ్రహ చికిత్సల గురించి , శలాక్య , శల్య , విష , రసాయన , వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది.

విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని , అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.
చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం.

ధన త్రయోదశి

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు.

అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం – ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా , యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం.

దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది.

ధన త్రయోదశి , నరక చతుర్దశి , దీపావళి , బలిపాడ్యమి , యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని , అత్యంత సంరంభంగా జరుపుతారు. ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు.

‘ఆమాదేర్ జ్యోతిషీ’ గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. ‘ధన్ తేరస్’ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.

ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది.

అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి , పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. Dhanvantari Jayanti

పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది.

అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య , సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి.

నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి , తన పాంచజన్య శంఖంతో , కామధేను క్షీరంతో , చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు.

అలాగే , శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు.

ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.

యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు.

ఆ రాకుమారుడు తన పదహారో ఏట , వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు.

దాంతో ఆ యువరాజు భార్య , తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది.

బంగారం , వెండి , రత్నాల్ని రాశులుగా పోసి , ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది.

యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ , బంగారం , వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి , వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ.

అందుకే స్త్రీల సౌభాగ్యానికీ , ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి , బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి – ధన త్రయోదశి.

ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల , దీపదానం వల్ల , యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.

‘చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ
తషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’

అని శాస్త్ర వచనం.

‘చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.

దంతేరాస్ పూజా విశిష్టత , ప్రాముఖ్యత..!

భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి , దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ , కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు.

ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ.

కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు – నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది. పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు.

ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా. ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు.

అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా? ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము.

ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా ? దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి.

1. ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం. చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ , అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ , గణపతినీ పూజిస్తారు.

బంగారం , వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు.

2. లక్ష్మీ దేవికి స్వాగతం

– సంపదకి గుర్తు లక్ష్మీ దేవి. అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ , నగలనీ , వెండి వస్తువులనీ కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.

3. యమ దీపం కధ

హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది.

తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో ఉంచి , గది నిండా బంగారం , వెండి నాణాలు కుప్ప పోసి , మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది.

యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి , దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు.

తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది. అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.

4. అమృత మధనం కథ –

దేవ దానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీర సాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధన త్రయోదశి నిష్టతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.

5. కుబేరుని పూజ 

యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి. ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా. Dhanvantari Jayanti

6. పార్వతీ దేవి కధ 

ధన త్రయోదశిని అల్లుకుని ఉన్న మరోక కదేమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీ దేవి మీద పరమ శివుడు విజయం సాధించాడు.

ఈరోజున కనుక పాచికలూ , జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం.

ఇప్పుడు తెలిసిందా ధన త్రయోదశి యొక్క విశిష్టత ? దీపావళి ముందు వచ్చే ఈ పండుగ భారత దేశంలో చాలా ముఖ్యమయినది.

ఈరోజున కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు. ఒక వేళ అవి కొనలేక పోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: