History of Batukamma – Festival Highlights

History of Batukamma - Festival Highlights

History of Batukamma – Festival Highlights – బతుకమ్మ చరిత్ర – పండుగ విశిష్టత – సెప్టెంబరు , అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు , ఇటువైపు అంతా పండుగ సంబరాలు , కుటుంబ కోలాహలాలు , కలయకలుతో నిండిపోయుంటుంది.

ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ , మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం , తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ.

రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ , సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు , ప్రేమ , స్నేహం , బంధుత్వం , ఆప్యాయతలు , భక్తి , భయం , చరిత్ర , పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..

తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.

ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు , భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.

వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని , తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు..

వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో , శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి.

వీటిలో గునుగు పూలు , తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి , చేమంతి , నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.

సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది.

వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

History of Batukamma - Festival Highlights
History of Batukamma – Festival Highlights

బతుకమ్మ పండుగ కథ

తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు , రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు.

క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు.

ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు.

అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు.

ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు.

రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.

అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు.

తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు.

తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు.

ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు.

వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.

బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను , తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు.

అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు.

బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు.

శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో , జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి , భూమితో , జలంతో , మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది.

ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు “బొడ్డెమ్మ” (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ పండుగ జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది.

పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు , మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే ,

పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు.

అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి , భిక్షమ్మ’ లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి , బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి.

పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ , బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇపుడు కూడా వున్నారు.

ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో , బిడ్డాలెందారే.. వలలో’ అని పాడే పాట సంతానం గురించే కదా.

నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారనపెరిగే తంగేడు , గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు.

ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మనగొప్పసంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు.

మానవజాతి పిల్లలవల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ.

బౌద్ధంలో ముందు చెడ్డదేవతగా , పిల్లల్ని ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధునివల్ల మంచిదానిగా , పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లలదేవతగా కొలుస్తారు.

పుట్టిన తమ పిల్లలు బతుకాలని , రోగాలు , రొష్టులు లేకుండ వుండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవతను గురించి బౌద్ధజాతక కథల్లో చదువగలం.

వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు.

2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దందాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించినారేమో.

కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మనపూర్వీకులు ఇనుము – ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారని , తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది.

తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు , గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవత(కూష్మాండిని ?) ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి వుంటుంది.

గునుగు , తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి , శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి , పసుపు , కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.

దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గారూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు.

కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగకు కూడా కులాల మసిపూయడం అనాచారం.

ఇది ఎక్కువ (పెద్దకులాల) వాళ్ళ పండుగ కాదు తక్కువ(చిన్నకులాల , జాతుల) వాళ్ళదే. గిరిజనులదే. తొలి మొలకలను , తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే.

పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు. ఆడపిల్లలను , పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు. మతాచారాలు రుద్దబడ్డాయి.

మనప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనులవల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయులవల్ల ప్రోత్సహించబడ్డది.

జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత , యక్షిణి అంబిక(అంబ=అమ్మ) లేదా కూష్మాండిని (గుమ్మడితీగె , గుమ్మడిపువ్వు). ఈమె ప్రతిమాలక్షణంలో చేతుల్లో ఫలాలతో , ఇద్దరు పిల్లలతో , మామిడిచెట్టుకింద కూర్చొనివున్నట్టు వుంది.

అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతిమారూపాలు క్రీ.శ.5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రకాధారాలు లేవు.

బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది.

పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు , మట్టి , ఇసుక , పేడ , రాయి , ఇటుకలతో తయారుచేసుకునేవారు.

బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు.

పూలు , ఇసుక , మట్టి , పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు , ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే.

అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు , వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు.

దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ , తమ మతదేవతలుగా చేసుకున్నారు.

ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా , జైనంలో ఆమ్రకూష్మాండినిగా , హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు.

తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లులరూపంలో ఏ దేవతవచ్చినా తమదేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది.

దసరాపండుగతో బతుకమ్మను కలుపడం , అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య)ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.

జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి , ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు , మన తెలంగాణాకే పరిమితమైంది.

ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం , చప్పట్లలో జానపదుల పాట , ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం.

బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.

History of Batukamma - Festival Highlights
History of Batukamma – Festival Highlights

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు

9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు , యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ:

మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు , బియ్యంపిండి , నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ :

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు , బెల్లం , అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ :

ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ :

నానేసిన బియ్యం , పాలు , బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ :

అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..

అలిగిన బతుకమ్మ :

ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ :

బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ :

నువ్వులు , వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ :

ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం , చింతపండు పులిహోర , లెమన్‌ రైస్‌ , కొబ్బరన్నం , నువ్వులన్నం.

బతుకమ్మ సంబరాలు

తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు , జొన్నలు , సజ్జలు , మినుములు , శనగలు , పెసర్లు , పల్లీలు , నువ్వులు , గోధుమలు , బియ్యం , కాజు , బెల్లం , పాలు ఉపయోగిస్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో

మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని , చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. .

ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.

ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి , ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది.

ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు , గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.

ఇందులో గునుగు పూలు , తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.

ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా , రంగులు మార్చుకుంటూ పేరుస్తారు.

ముందుగా తంగెడు ఆకులు , పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు , ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు.

ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు.

ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో , అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు.

సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు.

ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు.

ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం , సత్తుపిండి ( మొక్కజొన్నలు , లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం , నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు.

మలీద – చక్కెర , రొట్టెతో చేసిన పిండివంటకం చివరి రోజు సాయంత్రం , ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు , అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు.

చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత , సోదరభావం , ప్రేమను కలిపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు.

ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.

చీకటి పడుతుంది అనగా , స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ , తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు.

ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు , బతుకమ్మలతో అత్యంత సుందరంగా , వైభావయానంగా ఉంటుంది.

ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ , జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత , మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ , ఆడుతూ నీటిలో జారవిడుస్తారు.

ఆ తరువాత “మలీద” (చక్కెర , రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు.

ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ , బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ తొమ్మిది రోజులూ , ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.

check Ashvayuja month starts from tomorrow :

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: