Sumati sathakam – సుమతీ శతకం
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంతకలిఁగిన
దనభాగ్యమె తనఁకుగాగ తథ్యము సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! ధనమునకు పతియగు కుబేరుడు తనకు స్నేహితుడైనప్పటికినీ, శివుడు భిక్షము ఎత్తవలసి వచ్చినది కదా! అలాగే తనకు సంబంధించిన వారికి ఎంత ధనమున్ననూ తనకు ఉపయోగపడదు. తన అదృష్టఫలమే తనకు లభించును. పరులకున్న ధనమెన్నటికినీ రాదనీ భావం.

పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁగనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! అదృష్టమున్న రోజులలో అన్ని ద్రవ్యములు అరణ్యములందున్ననూ పొందగలవు. అదృష్టము లేనిచో బంగారపు కొండమీదయున్ననూ అన్ని ద్రవ్యములు అనుభవింపలేరు, అంటే అవి లభించవు అని భావం.