MAGHAPURANAM – 24 CHAPTER

శ్రీమన్నారాయణుని యనుగ్రహము – తులసీ మహాత్త్యము

గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి, మొదటి జామునందే, శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.

నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో, చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతినిమించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టు బట్టను కట్టి, మనోహరమైన రూపముతో, గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు, శ్రీమన్నారాయణుని స్తుతించి, భార్యతోబాటు, శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి ”నాయనా! కోరిన వరము నిచ్చెదను అడుగు అనెనుl”.

అప్పుడు సత్యజిత్తు ‘స్వామి! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము. వారిపై దయనుంచుము. తరువాత నాకును, నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము” అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. “ఓయీ! యీ ఏకాదశితిథి, సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే, నీకు ప్రసన్నుడనైతిని, కావున యీ తిథి, నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య, యీ పారిజాత వృక్షమును పెకిలించి, యింద్రునకిండు, పవిత్రము, వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని, నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు” అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి, పారిజాత వృక్షమును పెకిలించి, యింద్రాదుల కిచ్చెను. తులసిని, లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన, ఇంద్రాదులందరును, శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరిl.

శ్రీహరి, యింద్రాదులు వినుచుండగా, సత్యజిత్తును, వాని భార్యను జూచి, యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు, నీవు భక్తితో, ఈ విధముగ నన్ను పూజించి, నా అనుగ్రహము నుండుట వలన, మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీ తిథి, సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి, అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి, యేకాదశి నాడు ఉపవాసమును, జాగరణము చేసి, నన్ను స్మరించు వారు, నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున, సర్వసుఖములను, సర్వశుభములను, పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన, యీ తిథి, ఉత్తమ సంభావన నిచ్చి, వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు, పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును, యీ తిథి, మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున, దేవతలకు, మరల శక్తి, పుష్టికలుగుటచే, ద్వాదశి తిథిని, ప్రాణదాయిని, విష్ణుప్రియయని, అందురు. అజ్ఞానముచే, ఏకాదశి రోజు భుజించువారు, మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి, భోజనమును మాని, ఏకాదశినాడు, రెండు పూటల, భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున, నొకమారు భుజించి, నాటి రాత్రి భుజింపకయుండిన, చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము, సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున, ఉపవాసము, జాగరణము చేసి, నన్ను యధాశక్తి పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదసి ఉపవాసము చేసినవానినే గాక, వాని కులము వారినందరిని రక్షించి, అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు, సన్యాసి, వానప్రస్తుడు, స్త్రీబాలవృద్ధులు, అందరును, ఏకాదశినాడు భుజింపరాదు, ఏకాదశినాడు, స్త్రీ సుఖము, నిద్ర, అన్నము, వీనిని విడిచి, నన్ను పూజించవలెను. నా పాదోదకమును, సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్లకృష్ణపక్షములు, రెండిటను వచ్చు యేకాదశులన్నియు, నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము, యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా! మునులారా! నా భక్తులారా! ఎవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును, తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు, నా లోకమును చేరి, నన్ను పొందును. ‘ ఇది తధ్యము’ అని, బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని, జహ్నుమునికి వివరించెనుl.

గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి, యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని, మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు, శ్రీహరి చెప్పినట్లు, పారిజాతవృక్షమును తీసికొని, స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత, తులసి, శ్రీమన్నారాయణునితో నిట్లనెను. “స్వామీ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను, దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును” అని పలికిన తులసి మాటలను విని, శ్రీహరి,” భూమియందు అమృతము వలన పుట్టిన తులసి! నీవు నాకిష్టురాలవు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు. పవిత్రతను కలిగించుదానవు. పాపనాశినివి. తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు, గంగా స్నానము చేసిన వారువలె, పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారికి, పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి దళములను మాలగా చేసి, నా కంఠమున సమర్పించినవారు, అంతులేనంత, అనంతకాలము, నా లోకమున నుండి, నాలోనైక్యమగుదురు. నిన్ను తమ యిండ్లయందు గాని, తోటలయందు గాని, పెంచువారికి, యే పాపములును అంటవు.ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు, ఆ దినమున, సర్వ సుఖముల నందును.

యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః

యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||

అను శ్లోకమును చదివి, నీకు నమస్కరింపవలెను. తులసి! నీ దళములతో నీటిని, తన శరీరముపై జల్లుకొనువాడు, అపవిత్రుడైనను, పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని, తిలకముగ, నుదుటిపై ధరించినవాడు, సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన, వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ! త్రైలోక్యపావనీ! నేను నిన్ను, లక్ష్మీదేవిని, సమానముగా భావింతును” అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను, అన్నిటిని, శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన, తులసి మరింత కాంతిని, పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి, మనోహరమైన పవిత్రమైన, స్త్రీరూపమునంది, శ్రీహరి అంశను పొందెను. మాయావి, జగదీశ్వరుడు అయిన శ్రీహరి, లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము, కృష్ణవర్ణమై, కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములును, తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.

అప్పుడు శ్రీహరి, సత్యజిత్తును చూచి ‘నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ‘ అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి, తన భార్యతో కలసి భుజించెనుl. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత, శ్రీహరి, అందరును చూచుచుండ, సత్యజిత్తు దంపతులతోను, తులసితోను కలసి, గరుత్మంతుని పైనెక్కి, తనలోకమునకు పోయెను. నాయనా జహ్నుముని! యిది యేకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి, అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని, స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను, మాఘమాసమునందలి యేకాదశి, మరింత శుభప్రదము. ఆనాడు, ఉపవాసముండి, శ్రీహరిని పూజించి, జాగరణ, మంత్రానుష్ఠానము, స్మరణము, చేసినవారు, శ్రీహరికి ప్రీతిపాత్రులై, సాలోక్యమును, సాయుజ్యమును, పొందుదురు. ఏకాదశినాడు, ఉపవాసము, ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, యధాశక్తిగ గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు/బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై, తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును, శ్రీహరి కరుణా కటాక్షమునంది, విష్ణువును చేరుదురు, అని నిస్సందేహముగా చెప్పుచున్నాను” అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: